: వెళ్తూ వెళ్తూ... ఇరాన్ పై అణు ఆంక్షలు తీసేసిన ఒబామా
అమెరికా అధ్యక్ష పదవికాలం పూర్తి కానున్న చివరి రోజుల్లో బరాక్ ఒబామా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ పై అమలు చేస్తున్న అణు నిబంధనలను తొలగిస్తూ రూపొందించిన ఫైల్ పై సంతకాలు చేశారు. ఇరాన్ అణు కార్యకలాపాలను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజన్సీ (ఐఏఈఏ) పరిశీలించిందని, ఆ దేశంలో ఎటువంటి వినాశకర పనులూ జరగడం లేదని గుర్తించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని వైట్ హౌస్ విడుదల చేసిన ఓ ప్రకటన తెలిపింది. కాగా, ఐఏఈఏ పరిశీలకులు ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో పర్యటనలు జరిపి వచ్చినట్టు సంస్థ డైరెక్టర్ జనరల్ యుకియా అమెనో తెలిపారు. యుద్ధం కన్నా, ద్వైపాక్షికమే అమెరికా వైఖరన్న విషయం ఈ నిర్ణయంతో ప్రపంచానికి మరోసారి తెలిసిందని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు.