: అందమైన కురులను ఇలా కాపాడుకోవాలి!


అందమైన శిరోజాలు ముఖానికి మరింత అందాన్నిస్తాయనడంలో సందేహం లేదు. ఒత్తిడితో కూడిన రోజువారీ పని, కాలుష్యం తదితరాలతో పాటు తెలిసో తెలియకో చేసే ఎన్నో పనుల వల్ల శిరోజాలు మృదుత్వం కోల్పోయి పాడైపోతాయి. జుట్టు రాలే సమస్యా వెన్నాడుతుంది. దీన్ని నివారించాలంటే... * అత్యధికులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, తలస్నానం తరువాత హెయిర్ డ్రయ్యర్ లను వాడటం. జుట్టును త్వరగా ఆరబెట్టుకోవాలన్న ఉద్దేశం, కురుల సహజత్వాన్ని దెబ్బతీస్తుంది. తేమ గుణాలను పోగొట్టి, చర్మానికి హాని చేస్తుంది. హెయిర్ డ్రయ్యర్ ల వాడకానికి దూరంగా ఉండాలి. * ఇక రోజూ తలస్నానాలతో కూడా ఇబ్బందే. వారంలో మూడు సార్లకు మించి షాంపూ వాడరాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక తలంటుకోవడానికి కనీసం 30 నిమిషాల ముందు నూనెతో మర్దనా చేసుకుంటే, కురుల తేమ తలస్నానం తరువాత కూడా నిలిచేవుంటుంది. * గట్టిగా ఉండే టవల్స్ తో జుట్టును తుడవటం ద్వారా కొన్ని కురులు రాలిపోతాయి. మెత్తగా ఉండే నూలు టవల్స్ మాత్రమే వాడాలి. * కురులను ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరించే విటమిన్లు ఏ, సీ, ఈ అధికంగా లభించే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల శిరోజాలు మరింత అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. * తలస్నానం తరువాత చిక్కు పడ్డ కురులను వెంటనే సర్దాలని భావిస్తే కొంత జుట్టు ఊడిపోవడం ఖాయం. తడి పూర్తిగా ఆరిన తరువాతనే కురుల చిక్కులను విడదీయాలని, అందుకోసం తొలుత చేతివేళ్లను, ఆపై వెడల్పు పళ్లున్న దువ్వెనలు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సూచనలు పాటిస్తే, అందమైన కురులు మరింత అందంగా కనిపించడంతో పాటు మరింత కాలం నిలిచివుంటాయి.

  • Loading...

More Telugu News