: మేం వస్తామంటే ఓకేనా? విచారణకు ఏ పాక్ అధికారినీ రానివ్వం: పారికర్
విచారణ పేరిట పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి ప్రవేశించాలని భావించే ఏ పాక్ అధికారినీ దేశంలోకి రానివ్వబోమని రక్షణమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. "ఇండియాకు సమాచారం లేకుండా ఏ అధికారీ రాలేడు. వచ్చినా పఠాన్ కోట్ లోకి ప్రవేశించలేడు. మన భూభాగంగా దాడులు జరిపేవారికి శిక్షణ ఇస్తున్న పాక్ ప్రాంతాల్లో భారత అధికారుల బృందం పర్యటనకు ఆ దేశం అనుమతినిస్తుందా? మనమూ అంతే" అని పారికర్ వ్యాఖ్యానించారు. "పాక్ విచారణ అధికారులకు భారత్ పూర్తిగా సహకరిస్తుంది" అని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ప్రకటించిన నేపథ్యంలో పారికర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జైషే మహమ్మద్ ను నిర్మూలిస్తామని పాక్ చేపట్టిన చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని పారికర్ తెలిపారు. వారు ఏం చేస్తున్నారో తనకు తెలుసునని, భారత్ కు వ్యతిరేకంగా జరిగే ఏ చర్యలనూ సహనంతో ఉపేక్షించే వైఖరి ఇక ఉండబోదని స్పష్టం చేశారు. పఠాన్ కోట్ ఘటనపై విచారణ రెండు దశల్లో జరుగుతోందని తెలిపారు. ఉగ్రదాడి ఒక ఎత్తయితే, వారు లోపలికి ఎలా రాగలిగారన్నది విచారణలో కీలకమని వివరించారు. ఇండియాలో ఉంటూ, పాక్ కు అనుకూలంగా గూఢచర్యం చేస్తున్న వారిని త్వరలోనే ఏరివేస్తామని తెలిపారు.