: ప్రాణాలు వదులుతున్నా... మీరు పోరాడండి: నేతాజీ చివరి సందేశం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉన్న అనుమానాలు ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయి. ఆయన విమాన ప్రమాదంలోనే తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరి సందేశం ఇచ్చి, ఆపై కోమాలోకి వెళ్లి మరణించినట్టు తాజాగా విడుదలైన కొన్ని పత్రాలు వెల్లడిస్తున్నాయి. యూకేకు చెందిన ఓ వెబ్ సైట్ వీటిని వెల్లడించింది. తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో గాయపడ్డ నేతాజీ, ఆయన సన్నిహితుడు హబిబర్ రెహ్మాన్ ఖాన్ లను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన నేతాజీ, కోమాలోకి వెళ్లేముందు ఓ ఆంగ్ల అనువాదకుడిని రమ్మన్నారు. ఆపై, తాను దేశం కోసం పోరాడుతూ, ప్రాణాలను వదులుతున్నానని, స్వాతంత్ర్యం కోసం పోరు కొనసాగించాలని చివరిగా సందేశాన్ని ఇచ్చారు. తాను మరణించానన్న విషయాన్ని ఇండియాకు చెప్పాలని కోరారు. ఈ విషయాన్ని రెహ్మాన్ ఖాన్ అప్పట్లోనే ఓ ప్రకటన రూపంలో తెలియజేశారు కూడా. ఈ వివరాలను బట్టి ఆయన ఫ్లయిట్ యాక్సిడెంట్ లోనే మృతి చెందినట్టు తెలుస్తోందని వెబ్ సైట్ పేర్కొంది.