: పండగ సరదా... ప్రాణాల మీదకు తెచ్చింది!
ఒకరి పండగ సరదా మరొకరి ప్రాణాల మీదికి తెచ్చిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఆఫీసు విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న జిగ్నేష్ ఠక్కర్ (36) మెడకు ఎవరో సరదాకు ఎగురవేసిన పతంగం తాలూకు దారం చుట్టుకుంది. అది మాంజా దారం కావడంతో దానిని తప్పించుకునే క్రమంలో జిగ్నేష్ బైక్ పై నుంచి కిందపడ్డాడు. ఈ క్రమంలో ఆయన భుజం విరిగింది. అప్పటికే మాంజా దారం కారణంగా మెడ, చెవి భాగాలు లోతుగా తెగిపోయాయి. దీంతో ఆయన ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆయనను హుటాహుటీన ఆసుపత్రిలో చేర్చగా మెడకు 150, కుడి చెవికి 50 కుట్లు పడ్డాయి.