: ‘పరివార్’ పేరిట అగ్రిగోల్డ్ మరో మోసం...కేసు నమోదైన తర్వాత డిపాజిట్ల సేకరణ
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన లక్షలాది మందిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ యాజమాన్యం మరో నయా మోసానికి పాల్పడింది. తక్కువ కాలంలోనే అధిక వడ్డీలతో రెట్టింపు డబ్బు ముట్టజెబుతామని జనాన్ని నమ్మించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం వందలాది కోట్ల రూపాయలను వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మెచ్యూరిటీ తీరిన డిపాజిట్లకు సొమ్ము చెల్లించడంలో విఫలమైన అగ్రిగోల్డ్ పై డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై వేగంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేసులు నమోదు చేసిన సీఐడీ పోలీసులు సంస్థ కార్యాలయాలు, ఆస్తులను సీజ్ చేశారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు సొమ్ము చెల్లించే విషయంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు దృష్టి సారించింది. ఇదిలా ఉంటే... తనపై కేసు నమోదైన తర్వాత అగ్రిగోల్డ్ యాజమాన్యం మరో నయా మోసానికి తెరతీసింది. అగ్రిగోల్డ్ పరివార్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పేరిట రంగంలోకి దిగింది. అప్పటిదాకా నమోదైన కేసులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో సంబంధం లేకుండా ప్రతి నెలా అధిక వడ్డీ అందజేస్తామని జనాన్ని నమ్మించిన ఆ సంస్థ వందలాది కోట్ల రూపాయల మేర డిపాజిట్లను సేకరించింది. ఇందుకోసం అప్పటికే తమ కింద పనిచేసిన ఏజెంట్లకు భారీ నజరానాలను ఆఫర్ చేసిన ఆ సంస్థ యాజమాన్యం అనుకున్న మేరకు డిపాజిట్లు సేకరించగలిగింది. దీనిపై బాధితుల నుంచి కొన్ని ఫిర్యాదులు అందుకున్న సహకార శాఖ విచారణకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 19న విజయవాడలో జరగనున్న విచారణకు హాజరుకావాలని ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న ఏజెంట్లకు కృష్ణా జిల్లా డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి పీఆర్వీ రమణారెడ్డి నోటీసులు జారీ చేశారు.