: చంద్రబాబు సొంత మండలంలో జల్లికట్టుకు భారీ ఏర్పాట్లు... ప్రారంభించనున్న బాలయ్య?
సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజైన నేడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మరికాసేపట్లో తెరలేవనుంది. తమిళనాడుతో పాటు ఆ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ క్రీడకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరిగాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత మండలం చంద్రగిరిలోని పుల్లయ్యగారిపేట, రంగంపేటల్లో జల్లికట్టుకు మరికాసేపట్లో తెర లేవనుంది. ఆయా గ్రామాల్లో ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసిన ప్రజలు, అనుమతులు లేకున్నా జల్లికట్టును నిర్వహించి తీరతామని చెబుతున్నారు. మరో ఆశ్చర్యకరమైన అంశమేంటంటే... ఈ క్రీడలను టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సంబరాల కోసం చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో మూడు రోజులుగా మకాం వేసిన బాలయ్య ఇప్పటికే జల్లికట్టు జరగనున్న గ్రామాలకు పయనమైనట్లు సమాచారం. జల్లికట్టు వద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ క్రీడల ప్రారంభోత్సవానికి బాలయ్య హాజరవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రీడల్లో టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూడా స్వయంగా పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఏటా జరిగే జల్లికట్టు ఉత్సవాల్లో శివప్రసాద్ ఉత్సాహంగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... జల్లికట్టులో గాయపడే వారికి తక్షణ వైద్యం కోసం ఈ ఏఢాది అంబులెన్స్ లు అందుబాటులోకి వచ్చాయి. జల్లికట్టు జరిగే గ్రామాల్లోకి ఇప్పటికే అంబులెన్స్ లు చేరాయి.