: ప్రసంగాలతోనే రోడ్లను శుభ్రం చేయలేరు: మోదీపై రాహుల్ విమర్శ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ మరోమారు విమర్శల వర్షం కురిపించారు. నిన్న మహారాష్ట్ర రాజధాని ముంబైలో పర్యటించిన సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీ సర్కారుపై పదునైన విమర్శలను గుప్పించారు. కేవలం ప్రసంగాలతోనే రోడ్లు శుభ్రం కావని ఆయన కాస్తంత ఘాటు విమర్శలే చేశారు. మోదీ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వంగానే ముందుకెళుతోందని ఆయన విమర్శించారు. మాటలతోనే పనికాదని కూడా ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ పేరిట మోదీ ఇచ్చిన పిలుపుతోనే రోడ్లు శుభ్రం కావని, ముంబైలోని రోడ్లపై ఇంకా టన్నుల కొద్దీ చెత్త కనిపిస్తుండటమే ఇందుకు నిదర్శనమని రాహుల్ గాంధీ అన్నారు. ఈ తరహా పాలనతో ప్రజల్లో బీజేపీ ప్రభుత్వం పట్ల నమ్మకం కరిగిపోతోందని కూడా ఆయన పేర్కొన్నారు.