: మహ్మద్ ప్రవక్త... గోవధకు వ్యతిరేకం, గోమాంసాన్ని భుజించలేదు: కాలమిస్ట్ తారెక్ ట్వీట్స్
ప్రముఖ రచయిత, కాలమిస్ట్ తారెక్ పతాహ్ ఓ సంచలన వ్యాఖ్య చేశారు. ముస్లింల దైవం మహ్మద్ ప్రవక్త గోవధను వ్యతిరేకించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాక మహ్మద్ ప్రవక్త ఏనాడూ గోమాంసం భుజించలేదని కూడా తారెక్ స్పష్టం చేశారు. గోవధను వ్యతిరేకించడమే కాక గోవధను విడనాడాలని తన అనుయాయులకు చెప్పారని కూడా తారెక్ చేసిన ప్రకటన పెను కలకలం రేపేదిలానే ఉంది. ట్విట్టర్ వేదికగా తారెక్ పోస్ట్ చేసిన రెండు తాజా ట్వీట్లు పెద్ద చర్చకే తెరలేపనున్నాయి. ‘‘మహ్మద్ ప్రవక్త గోమాంసాన్ని ముట్టలేదు. గోవులను చంపొద్దని ముస్లింలకు బోధించారు. గోవు నుంచి పాలను మాత్రమే సేకరించాలని చెప్పారు. పాలిచ్చే గోవుల మాంసాన్ని తినవద్దని కూడా ప్రవక్త ముస్లింలకు చెప్పారు’’ అని తారెక్ తన ట్వీట్లలో పేర్కొన్నారు. పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించి, కెనడాలో స్థిరపడిన తారెక్ జన్మతః ముస్లిం అయినప్పటికీ లౌకికవాదిగా పేరుతెచ్చుకున్నారు.