: ఎంఐఎంను అడ్డుకునేది బీజేపీయే!: వెంకయ్యనాయుడు
హైదరాబాదులో ఎంఐఎం పార్టీ అరాచకాలను అడ్డుకునే శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విమర్శలపై ఆయన మాట్లాడుతూ, హైదరాబాదుకు మోదీ రావడం లేదని, తెలంగాణపై వివక్ష చూపుతున్నారని టీఆర్ఎస్ చెప్పడం సరికాదని అన్నారు. ఎవరైనా పిలిస్తే వస్తారని, ప్రధానిని అలా ఎవరూ పిలవలేదని ఆయన చెప్పారు. ప్రధాని హైదరాబాదు రాకూడదనే నియమం ఏమీ పెట్టుకోలేదని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. గ్రామీణాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే ప్రయాణికుల కోసం రైల్వే మరిన్ని సౌకర్యాలు కల్పించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.