: కేజ్రీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు... బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ కు కూడా!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఆ రాష్ట్ర హైకోర్టు నేటి ఉదయం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, అందులో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ప్రత్యక్ష పాత్ర ఉందంటూ కేజ్రీవాల్ ఘాటు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జైట్లీ... కేజ్రీ సహా తనపై విమర్శలు గుప్పించిన సొంత పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ పై పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ పై కొద్దిసేపటి క్రితం విచారణ చేపట్టిన హైకోర్టు కేజ్రీ సహా కీర్తి ఆజాద్ లకు నోటీసులు జారీ చేసింది. విచారణకు సంబంధించి తమ ముందు హాజరుకావాలని ఆ నోటీసుల్లో వారిద్దరికీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.