: రోహిత్ శర్మ... ఆస్ట్రేలియన్లకు కొరకరాని కొయ్యే!
టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ గా పేరుగాంచిన రోహిత్ శర్మ... నిజంగా ఆస్ట్రేలియన్లకు కొరకరాని కొయ్యే. కెరీర్ లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న రోహిత్, ఆస్ట్రేలియా జట్టుపై మాత్రం తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. నేడు బ్రిస్బేన్ లో జరుగుతున్న రెండో వన్డేలో సెంచరీతో ఆ దేశ జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ గా రోహిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కెరీర్ లో 68 సగటుతో ఉన్న రోహిత్ శర్మ, ఆసీస్ జట్టుపై మాత్రం 95 శాతం స్ట్రైక్ రేట్ సాధించాడు. కెరీర్ లో ఇప్పటిదాకా అతడు చేసింది పది సెంచరీలే అయినా, వాటిలో సగం.. అంటే, 5 సెంచరీలు ఆసీస్ పై చేసినవే కావడం గమనార్హం. అంతేకాక ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు సెంచరీలు సాధించిన భారత ఆటగాడిగానూ రోహిత్ రికార్డులకెక్కాడు. తొలి వన్డేలో 171 పరుగులతో అజేయ సెంచరీ సాధించిన రోహిత్, అప్పటిదాకా ఆ దేశ గడ్డపై 3 సెంచరీలు చేసి హైదరాబాదీ వెటరన్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సరసన చేరాడు. మరో మ్యాచ్ లోనే లక్ష్మణ్ రికార్డును చెరిపేసి రోహిత్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక వన్డేల్లో ఇప్పటిదాకా ఆరు డబుల్ సెంచరీలు నమోదు కాగా, వాటిలో రెండు రోహిత్ చేసినవే. ఆ రెండింటిలోనూ 209 పరుగులతో తన తొలి డబుల్ సెంచరీని రోహిత్ ఆస్ట్రేలియాపైనే చేశాడు.