: ‘పఠాన్ కోట్’పైనా కేజ్రీ రాజకీయం!...పంజాబ్ ఎన్నికల్లో గెలిస్తే మృతుల కుటుంబాలకు రూ.1 కోటి ప్రకటన


సివిల్ సర్వెంట్ హోదాను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆప్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఫక్తు రాజకీయ నేతలానే మారిపోయారు. వచ్చే ఏడాది పంజాబ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఆయన ఇప్పటి నుంచే ప్రచార హోరు సాగిస్తున్నారు. నిన్న పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కమెండోలు కుల్వంత్ సింగ్, ఫతే సింగ్ ల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లో తాము అధికారంలోకి వస్తే, పఠాన్ కోట్ దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. తద్వారా పంజాబ్ లో అధికారం చేజిక్కించుకునేందుకు ఆయన పఠాన్ కోట్ ఉగ్రవాద దాడిని వినియోగించుకున్నారన్న విమర్శలు రేకెత్తాయి. ఇక ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ అకాలీదళ్, విపక్ష కాంగ్రెస్ లపై ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తునకు కూడా ఆదేశాలు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రం సక్రమ మార్గంలో పయనించాలంటే తమకు ఓటు వేయాలని కూడా కేజ్రీవాల్ పంజాబీలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News