: హైదరాబాదులో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి: కేటీఆర్
విశ్వనగరం అంటే నాలుగు అద్దాల మేడలు మాత్రమే కాదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాదులో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే కానీ ఈ పట్టణం విశ్వనగరంగా మారదని అన్నారు. హైదరాబాదుకు తాగునీరు, నిరంతరాయ విద్యుత్, పాదచారులకు ఫుట్ పాత్ లు, పిల్లలకు విశాలమైన పార్కులు కల్పించి, ట్రాఫిక్ సమస్యలు తీర్చి, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చగలిగినప్పుడే హైదరాబాదు విశ్వనగరంగా అవతరిస్తుందని కేటీఆర్ చెప్పారు. గత 65 ఏళ్ల పాలకులు హైదరాబాదును భ్రష్టుపట్టించారని ఆయన పేర్కొన్నారు. నాలుగు అద్దాల మేడలు కట్టి అదే విశ్వనగరం అంటున్నారని ఆయన మండిపడ్డారు. ఆ పరిస్థితిని టీఆర్ఎస్ మారుస్తుందని ఆయన వెల్లడించారు.