: మూడు బస్తాల్లో దాచుకున్న యాచకుడి కరెన్సీ నోట్లు అగ్గిపాలు!


అతని పేరు మహమ్మద్ రెహ్మాన్. ముంబయ్ శివారు కల్యాణ్ ప్రాంతంలో యాచకుడు. తాను అడుక్కుని సంపాదించుకున్న డబ్బంతా, భార్య ఫాతిమాకు తెలియకుండా బస్తాల్లో కూరి పెడుతుండేవాడు. బుధవారం రాత్రి జరిగిన ఓ అగ్నిప్రమాదంలో రెహ్మాన్ గుడిసె తగులబడగా, బస్తాల్లో కూరి ఉంచిన 10, 50 రూపాయల నోట్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో రెహ్మాన్ గుండెలవిసేలా రోధించాడు. మొత్తం ఎంత డబ్బు దగ్ధమైనదన్న విషయం తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. డబ్బు ఎంత ఉందన్న విషయమై రెహ్మాన్ కు కూడా సమాచారం లేదని తెలుస్తోంది. ఇంటికి నిప్పంటుకున్న సమయంలో అతను లేడని, అందువల్ల వాటిని బయటకు తెచ్చే అవకాశం లేకపోయిందని, అతని భార్య మాత్రం ప్రాణాలను కాపాడుకుందని వివరించారు. అగ్నిప్రమాదం ఘటన గురించి తెలుసుకుని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న వేళ, రెండు బస్తాల్లోని నోట్లన్నీ పూర్తిగా దహనమై ఉండటాన్ని గమనించారు. మూడవ బస్తాలోని దాదాపు సగం నోట్లు మాత్రం మిగిలాయని తెలిపారు. ఆ యాచకుడికి బ్యాంకు ఖాతా లేకపోవడంతోనే బస్తాల్లో డబ్బు దాచుకుంటూ వచ్చాడని ఖడక్ పడా పోలీసు స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News