: కోరిక నెరవేర్చుకునేందుకు 100 కోట్ల మంది హిందువులు కోర్టు తీర్పు కోసం వేచిచూడరు: ప్రవీణ్ తొగాడియా
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించుకోవాలన్న మదిలోని కోరికను నెరవేర్చుకునేందుకు 100 కోట్ల మంది హిందువులు కోర్టులు తీర్పును వెలువరించే వరకూ ఎదురుచూసే పరిస్థితి లేదని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం పాటు సాగే కోర్టు విచారణల తరువాత వచ్చే నిర్ణయం కోసం వేచి చూడాలని కూడా కోరుకోవడం లేదని అన్నారు. మీడియాతో మాట్లాడిన తొగాడియా, పార్లమెంటులో చట్టాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని, ఈ విషయాన్ని మొత్తం హిందువుల మత విశ్వాసాలకు సంబంధించిన అంశంగా మాత్రమే చూడాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించగా, వారి పరిపాలనతో వీహెచ్పీకి ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు. తాము కేవలం రామాలయ నిర్మాణాన్ని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని, అందుకు సోమనాథ్ ఆలయ నిర్మాణం కోసం సర్దార్ పటేల్ వెళ్లిన మార్గంలో వెళ్లాలన్నది తమ కోరికని అన్నారు.