: టీసీఎస్ ఉద్యోగి కుమారుడిని లాగేసుకున్న యూఎస్ ప్రభుత్వం!
నవమాసాలు మోసి పండంటి బిడ్డను కని, అల్లారు ముద్దుగా చూసుకుంటుంటే, అమెరికన్ అధికారులు అన్యాయంగా, తమ బిడ్డను తమకు దూరం చేశారని టీసీఎస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న అశిష్ పారీక్, విదిషాల జంట బోరున విలపిస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, జైపూర్ కు చెందిన వీరిద్దరూ గత సంవత్సరం ఆగస్టు నుంచి అమెరికాలో ఉంటున్నారు. గత నెలలో పారీక్, తన బిడ్డ అశ్విద్ ను ఎత్తుకున్న వేళ, చేజారి కింద పడ్డాడు. ఈ క్రమంలో టీవీ స్టాండుకు బిడ్డ తల తగిలింది. ఆ వెంటనే విదిష, తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లగా, తలకు బలమైన గాయాలయ్యాయని చెప్పిన వైద్యులు చికిత్స మొదలు పెట్టారు. రెండు ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం అశ్విద్ కోలుకోగా, బిడ్డను కావాలనే గాయపరిచారని ఆరోపిస్తూ, అమెరికన్ చైల్డ్ వెల్ ఫేర్ అధికారులు, అతడిని శిశు సంరక్షణా కేంద్రానికి తరలించారు. దీంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాశారు. చిన్నారి పుట్టినప్పటి నుంచి బారసాల తదితర వేడుకల ఫోటోలు జత చేరుస్తూ, పొరపాటున జరిగిన ఘటనతో బిడ్డను దూరం చేయడం తగదని, తమ అశ్విద్ ను తమకిప్పించాలని కోరారు.