: ఆనాడు చావును దగ్గరగా చూశాను: భయానక అనుభవాన్ని వివరించిన సచిన్ టెండూల్కర్
తాను చిన్న వయసులో ఉండగా ఎదురైన భయానక అనుభవాన్ని గురించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్వయంగా వివరించారు. చావును అతి దగ్గరగా చూశానని చెప్పారు. ముంబైలో రైల్వే పోలీసులు ప్రవేశపెట్టిన 'సమీప్' (సేఫ్టీ అలర్ట్ మెసేజస్ ఎక్స్ క్లూజివ్లీ ఫర్ పాసింజర్స్), బీ-సేఫ్ యాప్ లను విడుదల చేసిన అనంతరం ప్రసంగిస్తూ, తన అనుభవాన్ని వివరించారు. "నేను నా 11 ఏళ్ల వయసు నుంచే ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించాను. రైళ్ల నుంచి గెంటివేయబడ్డాను కూడా. స్కూల్లో ఉన్నప్పుడు విల్ పార్లీ నుంచి స్నేహితులుండే ప్లేస్ కు వెళ్లి అక్కడి నుంచి ప్రాక్టీసుకు వెళ్లే వాడిని. ఓసారి ఐదారుగురు స్నేహితులం కలిసి సినిమాకు వెళ్లాలని అనుకున్నాం. సినిమా తరువాత ప్రాక్టీసుకు ఆలస్యమవుతుందని భావించి, బాంద్రా రైల్వే స్టేషనులో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాకుండా, ప్లాట్ ఫారాలను దాటాలని బయలుదేరాం. మధ్యలోకి వెళ్లాక మాకు అర్థమైంది. అన్ని ట్రాక్ లపై రైళ్లు వేగంగా వస్తున్నాయని. రెండు పట్టాల మధ్య మోకాళ్లపై కూర్చున్నాం. క్రికెట్ కిట్ బ్యాగులను గట్టిగా పట్టుకున్నాం. జరగబోయే ప్రమాదం ఎలా ఉంటుందా? అని భయపడ్డాం. అదృష్టవశాత్తూ ఏమీ జరగలేదు. ఆపై ఇంకెప్పుడూ పట్టాలను అలా దాటలేదు" అని వివరించారు. తాను ఆనాడు మరణాన్ని దగ్గరగా చూశానని వెల్లడించిన సచిన్, "ప్రతి యేటా ముంబైలో రైళ్ల నుంచి జారిపడి 700 మంది, పట్టాలు దాటుతూ 1600 మంది మరణిస్తున్నారు. ఇది దురదృష్టకరం. ఇంట్లో మీ వారు ఎదురుచూస్తున్నారన్న ఒక్క విషయాన్ని గుర్తుంచుకుని మరో 5 నిమిషాలు కేటాయిస్తే ఈ ఘటనలను నివారించవచ్చు. కిక్కిరిసిన రైళ్లలో, బోగీలపై ప్రయాణాలను మానుకోవాలి" అని సూచించారు.