: అన్నదాతలకు కేంద్రం సంక్రాంతి బొనాంజా!... ఉచితంగానే పంటల బీమా పథకం
దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు నరేంద్ర మోదీ సర్కారు సంక్రాంతి బొనాంజా ప్రకటించింది. పంటల బీమా పథకాన్ని ఉచితంగానే అందజేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటిదాకా పంటల బీమా కోసం ప్రీమియాన్ని రైతులే భరించాల్సి వచ్చేది. ఇకపై రైతులు నామమాత్రపు రుసుము చెల్లిస్తే, మెజారిటీ భాగాన్ని తానే చెల్లించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో సగాన్ని కేంద్రం, మరో సగాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించేలా రూపొందించిన పకడ్బందీ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంతేకాక ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటిదాకా మండలాన్ని యూనిట్ గా పరిగణిస్తూ వస్తున్నారు. అయితే దీనిని గ్రామం యూనిట్ గా మార్చాలని సుదీర్ఘకాలంగా రైతులు కోరుతున్నారు. ఈ వినతికి కూడా కేంద్రం పచ్చజెండా ఊపింది. పంటల బీమా కొత్త పథకాన్ని ఇకపై గ్రామం యూనిట్ గానే పరిగణనలోకి తీసుకోనున్నట్లు కూడా మోదీ సర్కారు విస్పష్టంగా ప్రకటించింది. అన్నదాతల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకం కోసం కేంద్రంపై ఏటా రూ.8.8 వేల కోట్ల భారం పడనుంది. నారు మళ్ల నుంచి పంట నూర్పిడి దాకా కూడా బీమా కొనసాగనుంది. అంతేకాక వడగళ్ల వర్షాలు, కొండచరియల వల్ల జరిగే నష్టానికి కూడా ఈ పథకంలో బీమా వర్తించనుంది. కరవు బృందాల పర్యటనలు, అధికారుల నివేదికలతో పనిలేకుండా... నష్టపోయిన తన పంట పొలం ఫొటోను రైతు స్మార్ట్ ఫోన్ లో పంపితే కూడా బీమా వర్తించే విధంగా ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది.