: సల్వీందర్ కు ‘ఉగ్ర’ లింకులు లేవట!... ఆధారాలు లభించలేదంటున్న ఎన్ఐఏ
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై విరుచుకుపడటానికి కొద్ది గంటల ముందు ఉగ్రవాదులు గురుదాస్ పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్ ను కిడ్నాప్ చేశారు. పఠాన్ కోట్ లోని ఓ ఆలయానికి వెళ్లి తిరిగివస్తున్న ఆయన కారును అటకాయించిన ఉగ్రవాదులు ఆయనతో పాటు ఆయన వంట మనిషి, స్నేహితులను కూడా కిడ్నాప్ చేసి ఆయన కారును ఎత్తుకెళ్లారు. అయితే సల్వీందర్ కు ఎలాంటి హానీ తలపెట్టకుండానే ఉగ్రవాదులు విడిచిపెట్టారు. ఆ తర్వాత పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి దిగిన ఉగ్రవాదులు ఏడుగురు కమెండోలను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనలో అందరి వేళ్లు సల్వీందర్ సింగ్ వైపు చూపించాయి. ఉగ్రవాదులకు దారి క్లియర్ చేసి ఇచ్చారని సల్వీందర్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సల్వీందర్ ను పలుమార్లు విచారించింది. నిన్న కూడా సల్వీందర్ ను ఎన్ఐఏ అధికారులు విచారించారు. అయితే ఉగ్రవాదులతో సల్వీందర్ కు ప్రత్యక్ష సంబంధాలున్నట్లు ఆధారాలు దొరకలేదట. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులే ఈ విషయాన్ని చెబుతున్నారు. పొంతన లేని సమాధానాలు చెప్పిన సల్వీందర్ పై తొలుత అనుమానాలు రేకెత్తాయని, అయితే ఇప్పటిదాకా జరిగిన విచారణలో ఆయనకు ఉగ్రవాదులతో లింకులు బయటపడలేదని వారు పేర్కొంటున్నారు.