: పఠాన్ కోట్ దాడిలో కొత్త ట్విస్ట్... ఎయిర్ బేస్ వెలుపల చైనా వైర్ లెస్ సెట్ లభ్యం
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడిపై జరుగుతున్న దర్యాప్తులో నిన్న సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ దాడిపై కేసు నమోదు చేసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఎయిర్ బేస్ సహా పరిసర ప్రాంతాల్లో ముమ్మర సోదాలు చేస్తున్నారు. అణువణునూ శోధిస్తున్న ఎన్ఐఏ అధికారులు ఏ చిన్న ఆధారం దొరికినా వదలడం లేదు. మొన్నటికి మొన్న ఉగ్రవాదులు వాడినట్లుగా భావిస్తున్న మొబైల్ ఫోన్ ఎయర్ బేస్ ప్రాంగణంలో లభించింది. తాజాగా నిన్న ఆ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేసిన అధికారులకు ఎయిర్ బేస్ వెలుపల నిలిపి ఉన్న ఓ వాహనంలో చైనాలో తయారైన వైర్ లెస్ సెట్ దొరికింది. వెనువెంటనే సదరు వైర్ లెస్ సెట్ ను అధికారులు ఛండీగఢ్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపించారు. వైర్ లెస్ సెట్ ను విశ్లేషిస్తే... దాడుల్లో పాకిస్థాన్ కు సంబంధించిన ప్రమేయం మరింత వెలుగుచూడటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.