: కాలిఫోర్నియా గురుద్వారాలో కత్తులుదూసుకున్న రెండు వర్గాలు!
రెండు వర్గాల వారు ఒకరిపై కత్తులు దూసుకున్నారు.. మ్యూజిక్ స్టిక్స్ తో కొట్టుకున్నారు.. పెప్పర్ స్ప్రే చల్లుకున్నారు..ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న టర్లాక్ గురుద్వారాలో గత ఆదివారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను 'సిక్కు 24' అనే న్యూస్ వెబ్ సైట్ ఒకటి విడుదల చేసింది. రెండు వర్గాలకు చెందిన స్త్రీలు, పురుషులు పరస్పరం దాడులకు పాల్పడటం ఈ వీడియోలో కనపడుతుంది. విరాళాల సేకరణ, అందుకు సంబంధించిన రశీదులు, గురుద్వారాపై పెత్తనం తదితర అంశాలకు సంబంధించి రెండు వర్గాలు గొడవపడ్డారని సమాచారం. వారికి సర్ది చెప్పేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ ప్రాంతం నుంచి రెండు వర్గాల వారిని వెళ్లిపోవాల్సిందిగా వారు చెప్పినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కాగా, ఈ గురుద్వారాలో ఈ విధంగా కొట్లాటలు జరగం ఇదే మొదటిసారి కాదు. 2013లో రెండు వర్గాల వారు ఫైటింగ్ కు దిగారు. నాడు జరిగిన దాడిలో ‘బెల్టు’ను వారు ఆయుధంగా ఉపయోగించారు. దీంతో ఆ గురుద్వారాను ‘బెల్టు గురుద్వారా’ అని పిలవడం పరిపాటయింది.