: పాకిస్థాన్ లో జైషే మూసివేతకు కారణం అదేనా?
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి జరిగిన అనంతరం పాకిస్థాన్ కు భారత్ పలు ఆధారాలు అందజేసింది. ఉగ్రదాడికి రూపకల్పన జరిగింది, దాని అమలుకు ఆదేశాలు ఇచ్చింది, వ్యూహాన్ని అమలు చేసింది పాకిస్థానీలేనని భారత్ స్పష్టం చేసింది. అంతటితో ఆగని భారతదేశం తమ విచారణాధికారులను పాకిస్ధాన్ పంపుతామని, అందుకు సహకరించాలని, లేని పక్షంలో ఆ దేశంతో నిర్వహించాలని భావించిన చర్చలు నిలిపేస్తామని హెచ్చరించింది. దీంతో పాకిస్థాన్ మరోసారి పాత పాట పాడింది. దాడి చేసింది పాక్ పౌరులు, దాడికి కుట్ర జరిగింది పాక్ గడ్డపై అనేందుకు ఆ ఆధారాలు సరిపోవని, మరిన్ని ఆధారాలు కావాలని భారత్ ను కోరింది. ఇంతలో అమెరికా మధ్యలో దూరి పాక్ చర్యలు నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. పఠాన్ కోట్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పాక్ తో ఫైటర్ జెట్ డీల్ ను మధ్యలో నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. అంతటితో ఆగని అమెరికా, పాకిస్థాన్ కు చెప్పకుండా ఒసామా బిన్ లాడెన్ ను తాము మట్టుబెట్టినట్టు భారత్ కూడా 'చేయాలనుకున్నది చేసేయాలని' సూచించింది. దీంతో, భారత్ నిఘా విభాగాలు ఈ దిశగా చర్యలు ప్రారంభించాయేమోనని భావించిన పాకిస్థాన్, పఠాన్ కోట్ ఉగ్రదాడి ఆనవాళ్లు లేకుండా జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యాలయాలు మూయిస్తోంది. అక్కడ ఉగ్రవాదులు ఉండకుండా అరెస్టుల పేరుతో వారిని అక్కడి నుంచి వేరే ప్రదేశాలకు తరలిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ గతంలో కూడా ఇలాంటి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. భారత భద్రతా దళాలకు ఎవరైనా ఉగ్రవాది సజీవంగా పట్టుబడితే, అతనికి సంబంధించిన ఆనవాళ్లు దొరకకుండా అన్ని జాగ్రత్తలు పాక్ తీసుకుంటుంది. పఠాన్ కోట్ ఉగ్రదాడిలో కూడా పాక్ ప్రవర్తన అలాగే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. పఠాన్ కోట్ ఘటనపై దారి మళ్లించే క్రమంలో భాగంగా, అఫ్ఘనిస్థాన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడులు చోటుచేసుకుంటున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. జైషే తీవ్రవాదుల అరెస్టు వెనుక అసలు కారణం త్వరలోనే తెలిసిపోతుందని, పాక్ మేకవన్నె రూపం తొందర్లోనే తొలగిపోతుందని వారు పేర్కొంటున్నారు.