: బ్యాంకులను నమ్ముకున్న వారికి నిద్రలేని రాత్రులే!
చైనా భయాలు ఒకవైపు, నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్న తీరు మరోవైపు ఎన్నో బ్యాంకుల ఈక్విటీలను కుదేలు చేయగా; ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు నిద్రలేని రాత్రులే మిగులుతున్నాయి. గత కొన్ని రోజులుగా, ఎన్నో బ్యాంకుల ఈక్విటీలు 52 వారాల కనిష్ఠానికి చేరుకుని పైకి లేవడానికి ఇబ్బందులు పడుతుండగా, ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఒత్తిడి అధికంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రైవేటు రంగ దిగ్గజాలైన యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు సైతం ఇన్వెస్టర్ల సంపదన హరించడంలో పోటీ పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత సంవత్సరం ఆరంభంతో పోలిస్తే, బ్యాంకుల ఈక్విటీ విలువ సరాసరిన 17 శాతం దిగజారింది. ఇక బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టిన వారి డబ్బు 16 శాతం వరకూ హరించుకుపోయింది. ఈ సంవత్సరం కాలంలో బ్యాంక్ నిఫ్టీ 16 శాతం పతనం కావడమే ఇందుకు నిదర్శనం. కాగా, ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమంటే, ఇండియా మార్కెట్లో ప్రస్తుతం 18 బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీములు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ దాదాపు రూ. 7 వేల కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సొమ్మును నిర్వహిస్తున్నాయి. మొత్తం ఈక్విటీ ఆస్తుల్లో ఇది 2 శాతం కన్నా తక్కువే అయినా, బ్యాంకింగ్ రంగం వరకూ ఇది పెద్ద మొత్తమే. సరాసరిన ఈ ఫండ్స్ అన్నీ ఈ ఏడు 16 శాతానికి పైగా నష్టాన్నే మిగిల్చాయి. దీంతో గడచిన ఐదేళ్ల కాలపరిమితిని పరిశీలిస్తే వచ్చిన ఆదాయం 4 నుంచి 5 శాతానికి పడిపోయింది. అంటే సాధారణ బ్యాంకులిచ్చే వడ్డీ కన్నా బ్యాంకులను నమ్ముకున్న ఫండ్ ఇన్వెస్టర్లకు తక్కువ ఆదాయమే లభించినట్టు. ఇక గడచిన పదేళ్ల బ్యాంకింగ్ ఫండ్ పనితీరును పరిశీలిస్తే 14.6 శాతం రాబడి వచ్చింది. ఈ ఫండ్ స్కీముల్లో రిలయన్స్ బ్యాంకింగ్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, సుందరం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆపర్చ్యునిటీస్ ఫండ్, బిర్లా సన్ లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, యూటీఐ బ్యాంకింగ్ సెక్టార్ ఫండ్ సంస్థలు ప్రధానమైనవి కాగా, మొత్తం ఆస్తుల్లో 65 శాతం, అంటే రూ. 4,400 కోట్లను ఈ సంస్థలే మేనేజ్ చేస్తున్నాయి. 2015 సంవత్సరంలో నష్టాలను పరిశీలిస్తే యూటీఐ (-17.22 శాతం), సుందరం (-15.72 శాతం), ఐసీఐసీఐ (-13.51 శాతం), రిలయన్స్ (-12.78 శాతం) నిలిచాయి. ఒక్క బిర్లా సన్ లైఫ్ మాత్రమే 6.4 శాతం నష్టంతో సరిపెట్టుకుంది.