: ఆగంతుకుడనుకుని కొడుకుని కాల్చిచంపిన తండ్రి!
ఆగంతుకుడనుకుని కన్నకొడుకుని పోలీసు అధికారి అయిన తండ్రి కాల్చిచంపిన విషాద సంఘటన అమెరికాలోని ఒహియోలో జరిగింది. సిన్సినాటి పోలీస్ శాఖలో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడి తండ్రిని విచారించిన పోలీసు అధికారులు వెల్లడించిన వివరాలు... సదరు పోలీసు అధికారి కొడుకు పేరు జార్టా మాక్(14). సిన్సియాటి లోని ఈస్ట్ ప్రైస్ హిల్ లో నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు మాక్ ను స్కూల్ బస్సు స్టాప్ వద్ద దింపిన తండ్రి తిరిగి ఇంటికి వెళ్లాడు. అయితే, మాక్ స్కూల్ కు వెళ్లకుండా ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. ఇంటి బేస్ మెంట్ వద్ద శబ్దం అవుతుండటంతో చూద్దామనుకున్న బాలుడి తండ్రి హ్యాండ్ గన్ తీసుకుని అక్కడికి వెళ్లాడు. సరదాగా తండ్రిని భయపెట్టాలని చూసిన మాక్ ను ఎవరో ఆగంతుకుడుగా భావించిన తండ్రి, అతని మెడపై అనుకోకుండా కాల్చాడు. తర్వాత తను కాల్చింది తన కొడుకునే అని తెలుసుకున్న ఆయన వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఎవరో ఆగంతుకుడు వచ్చాడనుకుని ఈ విధంగా చేశానని.. మాక్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని.. మెడ నుంచి రక్తం కారకుండా ఉండేందుకు ఒక క్లాత్ చుట్టానని ఆ ఫోన్ లో పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత మాక్ ను ఆసుపత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.