: దొంగతనం చేసిన అమ్మాయి పేరు నోటీసు బోర్డులో పెట్టి, విమర్శల పాలైన ఢిల్లీ కాలేజ్


సహ విద్యార్థిని మొబైల్ ఫోన్ ను దొంగతనం చేసి దొరికిపోయిన అమ్మాయి పేరును నోటీస్ బోర్డులో పెట్టినందుకు దయాల్ సింగ్ కాలేజీ యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాలేజీకి నోటీసులు పంపింది. వారు చేసిన నిర్వాకం కారణంగా విద్యార్థిని భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయని, బయట తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడింది. అయితే, కాలేజీ యాజమాన్యం మాత్రం తాము చేసిన పనిని సమర్థించుకుంటోంది. ఆమె తప్పును అంగీకరించిందని, క్రమశిక్షణా కమిటీ ముందు నేరాన్ని ఒప్పుకున్నందునే పేరును ప్రచురించామని వెల్లడించింది. కాలేజీ నోటీసు బోర్డుతో పాటు కళాశాల వెబ్ సైట్లో సైతం విద్యార్థిని పేరు బహిర్గతం కావడంపై మహిళా సంఘాలు తీవ్ర విమర్శలకు దిగాయి. ఇలా చేయడం తగదని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతీ మలివాల్ వ్యాఖ్యానించారు. ఇంకా విచారణ పూర్తి కాలేదని తనకు సమాచారం ఉందని, అమె అభిప్రాయాన్ని వినలేదని తెలుస్తోందని ఆమె పీటీఐ వార్తా సంస్థతో అన్నారు. ఒకవేళ విద్యార్థిని తప్పుచేసినా, సెల్ ఫోన్ దొంగిలించిన నేరానికి ప్రజల నుంచి హెరాస్ మెంట్ కు గురికావాలా? అని ప్రశ్నిస్తూ, కాలేజీ సస్పెన్షన్ వరకూ ఓకేనని, పేరును బయటకు చెప్పడం మాత్రం నిజాయతీ అనిపించుకోదని అన్నారు.

  • Loading...

More Telugu News