: ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు!... రాహుల్ లేఖకు సమాధానమిచ్చిన కేంద్రం
రాష్ట్ర విభజనతో ఆర్థిక లోటుతో సతమతమవుతున్న నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా దక్కే అవకాశాలు లేవు. ఈ విషయంలో అటు ఏపీలో అధికార పార్టీ టీడీపీ, ఆ రాష్ట్ర బీజేపీ నేతలు... ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని చేస్తున్న ప్రకటనలు నీటి మాటలేనని తేలిపోయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఈ విషయంపై విస్పష్ట ప్రకటన చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని సదరు ప్రకటనలో మోదీ సర్కారు తేల్చిచెప్పింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ కొద్దిసేపటి క్రితం సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఆ సమాధానంలో మంత్రి ప్రకటించారు. అయితే ఆర్థిక చిక్కుల్లో ఉన్న ఏపీని ఆదుకునేందుకు ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తోందని ఇంద్రజిత్ సింగ్ తెలిపారు.