: పుష్కర కాలంలో తొలిసారి... 30 డాలర్ల దిగువకు ముడిచమురు
నిన్న మినరల్ వాటర్ బాటిల్ ధరకన్నా తక్కువకు పడిపోయిన లీటరు ముడిచమురు ధర నేడు మరింత పాతాళానికి దిగజారింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ క్రూడాయిల్ ధర గత పన్నెండేళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయి 30 డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ ధర 3.1 శాతం పడిపోయి ఒక దశలో 29.93 డాలర్లకు చేరింది. డిసెంబర్ 2003 తరువాత క్రూడాయిల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఆపై కొద్దిగా తేరుకుని 30.44 డాలర్ల వద్ద కొనసాగింది. కాగా, బ్యారల్ క్రూడాయిల్ ధర 20 డాలర్లకన్నా దిగువకు పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బ్రెంట్ క్రూడాయిల్ ధర 30.86 డాలర్ల వద్ద ఉంది. ఇదిలావుండగా, ఆయిల్ ధరల సరళిని పరిశీలించేందుకు ఇస్తాంబుల్ లో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్) ప్రకటించింది.