: ముస్లింలను ఏమీ అనవద్దు... అదే మూడో ప్రపంచయుద్ధం కారాదు: చివరి ప్రసంగంలో ఒబామా
ప్రపంచం ముందున్న ఉగ్రవాదానికి, ముస్లిం సమాజానికి సంబంధం లేదని, భవిష్యత్ పై నమ్మకముంచే అమెరికన్లు ముస్లింలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయవద్దని అమెరికా అధ్యక్షుడు ఒబామా సూచించారు. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం అమెరికన్లకు క్షేమం కాదని అభిప్రాయపడ్డ ఆయన, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాన్ని రూపుమాపే దిశగా జరిగే పోరు మూడవ ప్రపంచయుద్ధంగా మారకూడదని అభిప్రాయపడ్డారు. "మిస్టర్ స్పీకర్, మిస్టర్ వైస్ ప్రెసిడెంట్, మెంబర్స్ ఆఫ్ కాంగ్రెస్, నా ప్రియ అమెరికన్ లారా..." అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన పలు విషయాలపై మాట్లాడారు. త్వరలో తాను కూడా ప్రజల్లో ఒకరిగా కానున్నానని, ఆపై సమస్యలకు పరిష్కారం కోసం పోరాటం కూడా చేస్తానని ఆయన తెలిపారు. ఎనిమిదేళ్ల తన సుదీర్ఘ పయనంలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరం ఆర్థిక వృద్ధి పరంగా సాధించింది స్వల్పమే అయినా, భవిష్యత్ పై నమ్మకముంచాలని కోరారు. "ఇకపై నేను విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్ ను నేర్పిస్తాను. రోగులకు పర్సనలైజ్డ్ మెడికల్ ప్రొడక్టులు మరింతగా దగ్గరయ్యేందుకు కృషి చేస్తాను. తుపాకుల నుంచి చిన్నారులను దూరం చేయడానికి ప్రయత్నిస్తా. కనీస వేతనాల పెంపుకు ఉద్యమిస్తా. ఇవన్నీ జరిగే వరకూ మీతోనే ఉంటా" అని ఒబామా అన్నారు. కొత్తగా వచ్చే నేతలు ప్రతి అమెరికన్, తాను భద్రంగా ఉన్నానన్న భావన కలిగించాలని ఆయన కోరారు. అందివస్తున్న అధునాతన సాంకేతికత జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరచాలని అభిలషించారు. పోలీసుల అవసరం లేని అమెరికాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అమెరికాలో రాజకీయాలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేలా ఉండాలే తప్ప, ఇతర దేశాల నుంచి విమర్శలు కొని తెచ్చేలా ఉండరాదని పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలనూ ప్రస్తావించారు.