: ఇక రోజంతా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు
రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇకపై రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు రోజంతా పనిచేయనున్నాయి. ఈ మేరకు భారతీయ రైల్వే కొత్త నిర్ణయాన్ని వెలువరించింది. రైల్లో ఖాళీలు ఉంటే, రైలు బయలుదేరే అరగంట ముందు వరకూ కూడా రిజర్వేషన్ చేయించుకోవచ్చు. ప్రస్తుతం రిజర్వేషన్ కౌంటర్లు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ మాత్రమే పనిచేస్తుండగా, చార్ట్ ప్రిపేర్ అయిన తరువాత రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం లభించదన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఖాళీలు ఉంటే, టికెట్ కలెక్టర్లను ఆశ్రయించి, వారికి తృణమో, పణమో సమర్పించాల్సి వస్తోందన్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటంతోనే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దూరప్రాంత రైళ్లలో మధ్యలో ఎవరైనా దిగిపోయే పక్షంలో, ఆపై రిజర్వేషన్లను కూడా రైలు బయలుదేరే అరగంట ముందు వరకూ పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు.