: ఐఎస్ తో అమెరికాకు ఎలాంటి ముప్పూ లేదు!... వీడ్కోలు ప్రసంగంలో ఒబామా వెల్లడి
ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన పాలనా కాలంలో దేశంలో జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో దృష్టి సారించాల్సిన అంశాలపై ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. తన హయాంలో దేశంలో ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధించిందని ఒబామా చెప్పారు. దేశంలో నిరుద్యోగాన్ని కూడా చాలా వరకు తగ్గించామన్నారు. తుపాకుల నుంచి పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. సమాన పనికి సమాన వేతనం కోసం భవిష్యత్తులో పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. చిన్నారుల విద్యపై భవిష్యత్తులో పటిష్ట చర్యలు చేపట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.