: కాల్ మనీ నిందితుడు శ్రీకాంత్ అరెస్ట్... భాగ్యనగరిలో పట్టేసిన టాస్క్ ఫోర్స్


విజయవాడలో కలకలం రేపిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అడగంగానే అప్పులిచ్చేసి, ఆపై అధిక వడ్డీలతో నడ్డి విరచడమే కాక వడ్డీ చెల్లించలేని బాధిత మహిళలను సెక్స్ రాకెట్ లోకి లాగుతున్న కాల్ మనీ నిందితుల వ్యవహారం ఏపీ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో అటు అధికార టీడీపీ నేతల బంధువులతో పాటు ఇటు విపక్ష వైసీపీ నేతల సహచరులు కూడా ఉన్నారన్న అంశంపై మొన్నటి అసెంబ్లీ సమావేశం అట్టుడికింది. ఈ కేసును సీరియస్ గా పరిగణించిన చంద్రబాబు ప్రభుత్వం నిందితులు ఎంతటి వారైనా వదలొద్దని పోలీసులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల్లో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. ముందస్తు బెయిల్ తీసుకున్న ట్రాన్స్ కో డీఈ సత్యానందంపై మరో కేసు నమోదు చేసి ఎట్టకేలకు ఆయనను అరెస్ట్ చేశారు. తాజాగా హైదరాబాదులో గుట్టుచప్పుడు కాకుండా తలదాచుకున్న ఈ కేసులో కీలక నిందితుడు పెండ్యాల శ్రీకాంత్ (ఏ6)ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పు తీసుకున్న మహిళలపై లైంగిక వేధింపుల పర్వాన్ని కొనసాగించిన విషయంలో శ్రీకాంతే ఆద్యుడని పోలీసులు భావిస్తున్నారు. శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని హైదరాబాదు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.

  • Loading...

More Telugu News