: సస్పెన్స్ కు తెరదించిన మెహబూబా... బీజేపీ వెంటేనని స్పష్టీకరణ
జమ్మూ కాశ్మీర్ లో రోజుల తరబడి కొనసాగుతున్న పొలిటికల్ సస్పెన్స్ కు మెహబూబా ముఫ్తీ ఎట్టకేలకు తెరదించారు. తమ ప్రయాణం బీజేపీతోనేనని ఆమె కుండబద్దలు కొట్టారు. కాశ్మీర్ సీఎం ముఫ్తీ మొహ్మద్ సయీద్ మరణంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేచింది. దాదాపు సరిసమానమైన సంఖ్యలో సీట్లున్న బీజేపీ, కాంగ్రెస్ లు మెహబూబాతో దోస్తీ కట్టేందుకు తెర వెనుక యత్నాలు చేశాయి. కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పర్యటనతో ఒక్కసారిగా చర్చకు తెర లేచింది. తండ్రి మరణంతో కుంగిపోయిన మెహబూబాను పరామర్శించేందుకు సోనియా వచ్చారని చెబుతున్నా, రాష్ట్రంలో తదనంతర ప్రయాణం కలిసి చేద్దామంటూ సోనియా, మెహబూబాకు ఆపర్ చేశారన్న వాదనలూ వినిపించాయి. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా కాశ్మీర్ లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఊహాగానాలన్నింటికీ తెర దించుతూ మెహబూబా నిన్న మీడియా ముందుకు వచ్చారు. తన ప్రయాణం బీజేపీతోనే కొనసాగుతుందని ఆమె విస్పష్టంగా ప్రకటించారు.