: హైదరాబాదులో గూండాయిజం, రౌడీయిజానికి కారణం ఎవరు?: కిషన్ రెడ్డి
హైదరాబాదులో టీడీపీ, బీజేపీ కూటమి పెద్ద పార్టీగా అవతరించిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తొమ్మిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి హైదరాబాదులో 14 శాసనసభ స్థానాలను గెలుచుకుందని అన్నారు. టీఆర్ఎస్ రెండు స్థానాలే గెలుచుకుందని అన్నారు. అలాగే రెండు ఎంపీ స్థానాలను టీడీపీ, బీజేపీ గెలుచుకుంటే, టీఆర్ఎస్ ఏమీ గెలుచుకోలేదని ఆయన గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకవైపు, టీడీపీ, బీజేపీలు మరోవైపు నిలబడ్డాయని ఆయన చెప్పారు. టీడీపీ, బీజేపీకి ఓటు వెయ్యకపోతే, ఆ ఓటు మజ్లిస్ పార్టీకి వేసినట్టేనని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే హైదరాబాదీలు నల్లా నీళ్లుతాగారన్న విషయం గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంఐఎం వల్లే హైదరాబాదులో గూండాయిజం నెలకొందని, రౌడీయిజానికి కారణం ఎంఐఎం అని ఆయన స్పష్టం చేశారు. ఈ గూండాయిజం, రౌడీయిజాన్ని అంతం చేయాలంటే టీడీపీ, బీజేపీకి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.