: అక్బర్, అసద్ ల కోరికను అమలు చేసే ప్రయత్నం మాత్రం చేశాడు: రేవంత్
20 నెలలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవంటే...ఎంఐఎం నేతలు అక్బురుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీలు వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో వద్దంటే, పక్కనే కొత్త చెరువు తవ్వుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇఛ్చారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీలో డబుల్ బెడ్రూం ఫ్లాట్లు కట్టిస్తామని అన్నారు. రవీంద్ర భారతిని కూలుస్తామంటున్నారు. మెట్రో పేరుతో సుల్తాన్ బజార్ షాపులు కూలుస్తానని హెచ్చరించారు, బీజేపీ టీడీపీ వ్యతిరేకించడంతో ఇప్పుడు మాట మార్చి హుస్సేన్ సాగర్ లో పెద్దపెద్ద బిల్డింగ్ లు కట్టిస్తానంటున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన వారిలో కనపడడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ముందొక మాట చెప్పి, దానిని ఖండించడం వారికే చెల్లిందని ఆయన పేర్కొన్నారు.