: మేల్కోండి...ఎవరు అర్హులో గుర్తించండి: హైదరాబాదీలకు జేపీ నడ్డా పిలుపు


మేల్కొండి...లక్ష్యం చేరేంతవరకు విశ్రమించకండి అని స్వామీ వివేకానంద అన్నారని, ఇప్పుడు హైదరాబాదీలకు ఆ సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా సూచించారు. హైదరాబాదులోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఆయన మాట్లాడుతూ, వివేకానందుడి స్ఫూర్తితో గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత వాజ్ పేయి సహకారంతో హైదరాబాదును ఉన్నత స్థానానికి తీసుకెళ్లారని ఆయన చెప్పారు. హైదరాబాదును 15 ఏళ్ల క్రితమే వాజ్ పేయి, చంద్రబాబు కలిసి స్మార్ట్ సిటీగా రూపుదిద్దారని ఆయన పేర్కొన్నారు. ఐటీ ఇండస్ట్రీకి ప్రధాన కేంద్రాలుగా ఉన్న బెంగళూరు, చెన్నై నుంచి పరిశ్రమలను తీసుకొచ్చి, హైదరాబాదును ఐటీ పరిశ్రమకు ప్రధాన నగరంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని ఆయన చెప్పారు. హైదరాబాదును అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు దేశంలోని వివిధ నగరాల నుంచి జాతీయ రహదారులను కలిపిన ఘనత వాజ్ పేయి, చంద్రబాబుకు చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదుతో బెంగళూరు, విశాఖ మీదుగా కోల్ కతాకు అంతర్జాతీయ స్థాయి జాతీయ రహదారులు ఏర్పాటు చేసిన ఘనత కూడా వాజ్ పేయి, చంద్రబాబులేకే చెందుతుందని ఆయన వివరించారు. తాజాగా పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతీయ రహదారులను ప్రకటించిన సంగతి తెలిసిందేనని ఆయన చెప్పారు. అలాగే రామగుండం విద్యుత్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించే బాధ్యతను ప్రధాని తీసుకున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో వివిధ కార్యకలాపాల కల్పనకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని, కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News