: కేసీఆర్! సొంత పనులకు అధికారులను ఎలా వినియోగించుకుంటావ్?: మోత్కుపల్లి
అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు మండిపడ్డారు. హైదరాబాదులో నిజాం కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నా సొంత డబ్బుతో యాగం చేస్తున్నానని చెప్పిన కేసీఆర్, ఆ యాగంలో ప్రభుత్వ అధికారులను ఎందుకు వినియోగించాడని నిలదీశారు. యాగం చేయడాన్ని తాను తప్పు పట్టడం లేదని పేర్కొన్న ఆయన, ప్రజలు ఎంతో బాధ్యతతో ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే ప్రజధానం వేస్టు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా లక్ష్మీనరసింహస్వామికి వీర భక్తుడ్నని చెప్పిన ఆయన, పూజించడం తన వ్యక్తిగత విషయమని, దానిని ప్రచారం చేసుకోనని చెప్పారు. బీజేపీ జోకర్ పార్టీ అని అంటున్న కేటీఆర్...మరి ప్రధాని కాళ్లకు నీ తండ్రి సాగిలపడి ఎందుకు నమస్కారం చేస్తున్నాడని ఆయన నిలదీశారు. టీఆర్ఎస్ నేతలు 'ముందు పొగుడుతారు, వెనుక తిడతారని', అలాగే ముందు వరాలు గుప్పిస్తారు...గెలిపిస్తే పట్టించుకోరని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ నేతలను గెలిపించుకోవాలని ఆయన సూచించారు.