: తెలుగు తల్లిని తిట్టిన సంఘటన మర్చిపోయారా?: టీఆర్ఎస్ ను నిలదీసిన లక్ష్మణ్
సీమాంధ్రుల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానంటున్న కేసీఆర్ ను సూటిగా అడుగున్నా, గతంలో సీమాంధ్రులపై చేసిన వ్యాఖ్యలన్నీ తప్పుడు వ్యాఖ్యలని ఒప్పుకుంటారా? అని బీజేపీ నేత లక్ష్మణ్ కేసీఆర్ ను అడిగారు. హైదరాబాదులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, లంకలో పుట్టిన వారంతా కోతులే..అలాగే సీమాంధ్రలో పుట్టిన వారంతా సీమాంధ్రులే అంటూ కామెంట్ చేసిన విషయం మర్చిపోయారా? అని నిలదీశారు. హైదరాబాదు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా మారకముందు ఇక్కడ ఉన్నవారు మాత్రమే తెలంగాణ వారు, మిగిలిన వారంతా ఆంధ్రులే అన్న విషయం మర్చిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. తెలుగు మాట్లాడితే తెలంగాణ వారు కాదు, తెలంగాణ మాట్లాడిన వారే తెలుగు వారు, తెలుగు తల్లి వేరు తెలంగాణ తల్లి వేరు అన్న వ్యాఖ్యలు మర్చిపోయారా? అని ఆయన నిలదీశారు. వీటన్నింటికీ సమాధానం చెప్పి అప్పుడు సీమాంధ్ర ప్రజలపై ప్రేమ ఒలికించాలని ఆయన కేసీఆర్ కు సూచించారు.