: ఐదుగురు ఫేమస్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టులు... ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో మీకు తెలుసా?
ముంబైలో 83 ఎన్ కౌంటర్లు చేసిన దయానాయక్ తిరిగి విధుల్లోకి చేరాడని ఈ ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై నుంచి మాఫియాను ఏరివేయడానికి ఎంతో కృషి చేసి, తమదైన శైలిలో ఎన్ కౌంటర్ల మీద ఎన్ కౌంటర్లు చేసిన ఐదురుగు పోలీసు ఉన్నతాధికారుల గురించి మీ కోసం... దయా నాయక్: 1995 బ్యాచ్, వయసు 48, చేసిన ఎన్ కౌంటర్ లు 83. వీరిలో ముఖ్యులు చోటా రాజన్ గ్యాంగ్ సభ్యులు. ప్రస్తుతం: తిరిగి విధుల్లోకి తీసుకోబడ్డారు. నాయక్ పై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నాడన్న కేసు కోర్టులో వీగిపోయింది. 2006లో ఏసీబీ ఆయన ఇంటిపై దాడులు చేసి అరెస్ట్ చేయగా, ఆపై సస్పెన్షన్ వేటు పడింది. తిరిగి ఇప్పుడు విధుల్లో చేరారు. ప్రదీప్ శర్మ: 1983 బ్యాచ్, వయసు 54, చేసిన ఎన్ కౌంటర్లు 113. వీరిలో లష్కరేతోయిబా ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ప్రస్తుతం: విధుల నుంచి తొలగించబడ్డారు. పలు ఎన్ కౌంటర్ కేసుల్లో ప్రదీప్ శర్మ చిక్కుకుని విధులకు దూరమయ్యారు. ఖవాజా యూనస్ అనే ముంబై పేలుళ్ల నిందితుడు ప్రదీప్ కస్టడీలో 2003లో మరణించాడు. దావూద్ ఇబ్రహీంతో ప్రదీప్ కు పరిచయం ఉందన్న వార్తలున్నాయి. మాల్దాలో 2006లో జరిగిన ఓ భూమి వివాదం కేసులో తలదూర్చాడన్న ఆరోపణలున్నాయి. జనవరి 2010లో లఖన్ భయ్యాను ఎన్ కౌంటర్ చేసిన కేసులో అరెస్టయ్యారు. ఆపై 2013లో నిర్దోషిగా బయటపడ్డప్పటికీ, విధుల్లో చేరలేదు. రామ్ గోపాల్ వర్మ తీసిన 'డిపార్ట్ మెంట్' చిత్రంలో ప్రదీప్ పాత్రను సంజయ్ దత్ పోషించాడు. విజయ్ సలాస్కర్: 1983 బ్యాచ్, చేసిన ఎన్ కౌంటర్లు 83, అరుణ్ గావ్లీ గ్యాంగ్ ను మట్టుబెట్టిన వీర పోలీసు. ప్రస్తుతం: 26/11 దాడుల్లో ఉగ్రవాదులను ప్రత్యక్షంగా ఎదుర్కొని వీరమరణం పొందారు. ముంబైపై కసబ్ సహా ముష్కర మూక దాడి చేసినప్పుడు, తన 50 ఏళ్ల వయసులో భరతమాత రుణం తీర్చుకునేందుకు కదిలి, వీరోచితంగా పోరాడి అమరుడైన పోలీసు అధికారి. అంతకుముందు ముంబై పోలీస్ యాంటీ-ఎక్స్ టార్షన్ విభాగంలో పని చేశారు. సచిన్ వాజే: 1983 బ్యాచ్, చేసిన ఎన్ కౌంటర్లు 63. చోటా రాజన్, దావూద్ ఇబ్రహీం టీంలోని ఎందరినో మట్టుబెట్టారు. ప్రస్తుతం: రాజీనామా చేసి విధులకు దూరం. 1990లో మహారాష్ట్ర పోలీసు శాఖలో చేరిన వాజే, 2007లో రాజీనామా చేశారు. సైబర్ నేరాల అదుపులో, అధునాతన ఆయుధాల వాడకంలో దిట్ట. ఖవాజా యూనిస్ మరణం అనంతరం కేసుల్లో ఇరుక్కున్నారు. వాజే స్వయంగా నిందితుడి కడుపులో సూదులు గుచ్చారని, ఐస్ వాటర్ లో తలకిందులుగా వేలాడదీశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంతోనే ఖవాజా మరణించాడని నివేదిక రాగా, తన పదవికి వాజే రాజీనామా చేయాల్సి వచ్చిందని సమాచారం. రవీంద్రనాథ్ ఆంగ్రే: 1983 బ్యాచ్, వయసు 55, చేసిన ఎన్ కౌంటర్లు 52. అండర్ వరల్డ్ డాన్ సురేష్ మచేకర్, గ్యాంగ్ స్టర్ అమర్ నాయక్ బృంద సభ్యులను మట్టుబెట్టారు. ప్రస్తుతం: సస్పెన్షన్ లో ఉన్నారు. 2008లో తొలిసారిగా ఆంగ్రేపై ఆరోపణలు వచ్చాయి. ఓ ప్రముఖ బిల్డర్, తనను బెదిరిస్తున్నాడని ఆంగ్రేపై ఫిర్యాదు చేయడంతో 2009లో కొద్ది కాలం జైలు శిక్ష, ఆపై సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్నారు. ఆపై విధుల్లోకి వచ్చినప్పటికీ, 2010లో హత్యాయత్నం ఆరోపణలపై మరో 49 రోజులు జైల్లో గడిపారు. సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నుంచి బయటపడ్డారు. ఆపై గడ్చిరోలీకి బదిలీ చేయగా, అక్కడికి వెళ్లడం ఇష్టంలేక, దాన్ని వ్యతిరేకించడంతో జూన్ 2014లో అతన్ని విధుల నుంచి తొలగిస్తున్నట్టు ముంబై పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. గత సంవత్సరం బీజేపీలో చేరిన ఆంగ్రే, 2017లో థానేలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీలను బీజేపీ తరఫున దీటుగా ఎదుర్కొనే తురుపుముక్కగా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు.