: హైదరాబాదు ఖాళీ అవుతోంది... బస్, రైల్వే స్టేషన్లు ఫుల్ బిజీ!
హైదరాబాదు ఖాళీ అవుతోంది. సంక్రాంతి పండుగకు రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో నగర వాసులు సొంత ఊర్లకు బయల్దేరుతున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో స్థిరపడిన వారంతా సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు చేరుకుంటారు. కుటుంబ సభ్యులు, చుట్టాలు, సన్నిహితులతో సంప్రదాయ పధ్ధతిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకునే సంక్రాంతిని సొంత ఊర్లోని ఇళ్లలో నిర్వహించుకోవడం ఆనవాయతీ. దీంతో ఏడాది మొత్తం విధులు, వ్యాపారాలు, ఇతరత్రా పనులతో బిజీగా ఉండే తెలుగు ప్రజలు సంక్రాంతికి పనులన్నీ పక్కన పెట్టేసి సొంత ఊరును వెతుక్కుంటూ వెళ్లిపోతారు. సంక్రాంతి తొలి ఘట్టంలో భాగంగా, గుండెల నిండా అనుభూతులు నింపుకునేందుకు పట్టణవాసులు ప్రస్తుతం పల్లెబాటపడుతున్నారు. సొంత ఊర్లకు చేరుకునే ప్రయాణికులతో హైదరాబాదులోని బస్టాండులు, రైల్వే స్టేషన్ లు కిటకిటలాడుతున్నాయి. ఈ రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలను పెంచి టికెట్లు అమ్ముకుంటున్నాయి.