: భద్రత డొల్ల... రూ. 50 ఇస్తే పఠాన్ కోట్ లోకి ఎవరైనా!
పఠాన్ కోట్ లో ఉగ్రదాడుల అనంతరం విచారణ జరుపుతున్న అధికారులకు అక్కడి భద్రతా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఎయిర్ బేస్ వద్ద భద్రత ఎంతమాత్రమూ సరిగ్గా లేదని, అక్కడ కాపలాగా ఉండేవారు రూ. 50 తీసుకుని స్థానికులను లోనికి అనుమతించేవారని దర్యాఫ్తు వర్గాలు కనుగొని విస్తుపోయాయి. ఎయిర్ బేస్ లోపలే ఉండే వారు ఎవరో ఉగ్రవాదులకు సాయం చేశారని గట్టిగా నమ్ముతున్న ఎన్ఐఏ, దాదాపు 5 వేల మంది ఫోన్ నంబర్ల డేటాను నిశితంగా పరిశీలించే పనిలో పడింది. ఉగ్రవాదులు వాడిన ఫోన్లు కూడా భద్రతా దళాలకు దొరకడంతో, వారి నుంచి ఎవరి ఫోన్లకు కాల్స్ వెళ్లాయన్న విషయం సులువుగా తెలుస్తుందని భావిస్తున్నారు. ఈ దాడి తరువాత జరిగిన విచారణలో భిన్న వాదనలు వినిపించిన గురుదాస్ పూర్ మాజీ ఎస్పీ సల్వీందర్ ను వరుసగా రెండవ రోజూ ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు.