: ముత్తవకుంట గ్రామాన్ని దత్తత తీసుకున్న వివేక్ ఒబెరాయ్
అనంతపురం జిల్లాలోని ముత్తవకుంట గ్రామాన్ని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ దత్తత తీసుకున్నారు. ఇవాళ ఆ గ్రామంలో పర్యటించిన ఆయన, పాఠశాల, సీసీరోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. ముత్తవకుంట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా వివేక్ తెలిపారు. ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో వచ్చిన 'రక్త చరిత్ర' సినిమాలో పరిటాల రవీంద్ర పాత్ర పోషించడం ద్వారా వివేక్ అనంతపురం ప్రజలకు గుర్తుండిపోయారు. దాంతో ఈ జిల్లాపై మక్కువతో ఇక్కడి ప్రజలకు తన వంతు సహాయం చేసేందుకుగానూ ముత్తవకుంటను దత్తత తీసుకున్నారు.