: నారాయణఖేడ్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల
దేశంలోని 12 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అందులో మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గానికి కూడా షెడ్యూల్ విడుదలైంది. దానికి సంబంధించి ఈ నెల 20న నోటిఫికేషన్ వెలువడనుంది. 20 నుంచి 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఫిబ్రవరి 13న పోలింగ్ జరగనుండగా, 16న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఓ వైపు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపికతో సతమతమవుతున్న పార్టీలు, ఇప్పుడు నారాయణఖేడ్ ఎన్నికతో మరింత ఒత్తిడిలో పడ్డాయి. ఇప్పుడా స్థానానికి పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 5న మేయర్ ఎన్నికల ఫలితాలు వెల్లడితో గ్రేటర్ తంతు ముగుస్తుంది. తరువాత ఎనిమిది రోజులకే నారాయణఖేడ్ కు పోలింగ్ జరుగుతుంది. అంటే గ్రేటర్ ఎన్నికల సమయంలోనే అభ్యర్థి విషయంపై పార్టీలు ఓ నిర్ణయానికి రావల్సి ఉందన్నమాట.