: పఠాన్ కోట్ ఎఫెక్ట్!...పాక్ కు ఎఫ్-16 విమానాలు ఇప్పట్లో ఇవ్వలేమంటున్న అమెరికా
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి పాకిస్థాన్ ను ముప్పు తిప్పలు పెడుతోంది. దాడికి రూపకల్పన పాక్ లోనే జరిగిందని భారత్ ఆరోపిస్తోంది. పాక్ లోనే దాడికి సంబంధించిన సూత్రధారులున్నారని కూడా తన స్వరాన్ని పెంచింది. అంతేకాక అందుకు తగిన ఆధారాలను కూడా పాక్ ముందు పెట్టేసింది. ఈ నేపథ్యంలో సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అమెరికా కూడా పాక్ పై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఎఫ్-16 యుద్ధ విమానాల విక్రయానికి సంబంధించి కుదిరిన ఒప్పందాన్ని అమెరికా ‘హోల్డ్’లో పెట్టేసింది. ఇప్పటికిప్పుడు పాకిస్థాన్ కు ఎఫ్-16 ఫైటర్ జెట్లను సరఫరా చేయలేమని అమెరికా చట్టసభ కాంగ్రెస్ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని కూడా కాంగ్రెస్ ఆమోదించింది. ఈ తీర్మానంలో ఎక్కడ కూడా పఠాన్ కోట్ దాడిని పేర్కొనని కాంగ్రెస్... మరింత సమాచారం, వివరణను సాకుగా చూపింది.