: తిరిగొచ్చిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్!
ముంబై పోలీసు వర్గాల్లో 'ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్'గా గుర్తింపు పొంది ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచి, ఆపై సస్పెన్షన్ కు గురైన దయానాయక్ తిరిగి విధుల్లో చేరనున్నారు. 1995 బ్యాచ్ కు చెందిన సబ్ ఇనస్పెక్టర్ గా ఉన్న నాయక్, అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2006లో ఆరేళ్ల సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్నది దయాపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఆయన సస్పెన్షన్ ను తొలగించామని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. వాస్తవానికి ఆయన సస్పెన్షన్ 2012లోనే పూర్తికాగా, నాగపూర్ లో పోస్టింగ్ ఇవ్వడంతో, అక్కడ చేరేందుకు దయానాయక్ నిరాకరించి దీర్ఘకాల సెలవుపై వెళ్లడంతో, 2014 జూన్ లో మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు మరో సస్పెన్షన్ విధించారు. ఇక ఇప్పుడు దయానాయక్ కు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారన్న విషయమై పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఆయన ముంబైలో పేరుమోసిన గ్యాంగ్ స్టర్లు, మాఫియా నేతల్లో 80 మందికి పైగా చంపేశారు. దయా పేరు చెబితేనే రౌడీ వర్గాల్లో వణుకు పుట్టేది. గ్యాంగ్ స్టర్లు వినోద్ మట్కర్, రఫీక్ దాబా, సాదిక్ కాలియాలతో పాటు ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులనూ ఆయన తన చేతులతో ఎన్ కౌంటర్ చేసి హతమార్చాడు. కోర్టుల్లో ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని తేలిపోవడంతోనే సస్పెన్షన్ ఎత్తివేసినట్టు ముంబై పోలీసు వర్గాలు వెల్లడించాయి.