: ఒబామా కంట తడి నకిలీదా?...‘ఉల్లి’ఘాటే కారణమంటూ ‘ఫాక్స్ న్యూస్’ యాంకర్ వెటకారం


అమెరికాలో నానాటికీ పెరిగిపోతున్న గన్ కల్చర్ కు చెక్ పెట్టాల్సిందేనని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎప్పటినుంచో యత్నిస్తున్నారు. నూతన సంవత్సరంలోనైనా ఈ దిశగా కాంగ్రెస్ పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 5న తన అధికారిక నివాసం వైట్ హౌస్ నుంచి ఆయన దేశ ప్రజలనుద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో బుద్ధిగా చదువుకుంటున్న 20 మంది చిన్నారులు ఉన్మాది ఘాతుకానికి బలైన ఘటనను గుర్తు చేసుకుని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యం విశ్వవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఒబామా కళ్లలో సుడులు తిరిగినవి అసలు కన్నీళ్లు కాదని, అవి నకిలీ కన్నీళ్లని అమెరికాకే చెందిన ప్రముఖ న్యూస్ చానెల్ ‘పాక్స్ న్యూస్’ ప్రతినిధి ఆండ్రియా టాంటరాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ లైవ్ షోలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఒబామా కన్నీళ్లన్నీ ‘ఫేక్’ అని తేల్చేసిన టాంటరాస్... వేదికపై ఏదైనా ఉల్లి ఉందేమో చూడాల్సిందని కూడా వ్యాఖ్యానించారు. ఇక ఆమెతో పాటే చర్చలో పాల్గొన్న ఆ చానెల్ ప్రతినిధి మెలిస్సా ఫ్రాన్సిస్ కూడా ఒబామా కంట తడి అనుమానాస్పదమేనని కుండ బద్దలు కొట్టారు. అంతటితో ఆగని మెలిస్సా... ఆ ఘటనను రాజకీయాల్లో దుస్సంప్రదాయంగా అభివర్ణించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చానెల్ వారిద్దరినీ రెండు వారాల పాటు సస్పెండ్ చేసింది.

  • Loading...

More Telugu News