: 13 ఏళ్ల బాలికలతోనా... కామాంధులు వీరు!: 'పీస్ కీపర్స్'పై ఐరాస సంచలన వ్యాఖ్యలు
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పనిచేస్తున్న కొందరు కామాంధులుగా మారారని, ఐరాస వ్యవస్థలో ఓ క్యాన్సర్ గా తయారయ్యారని సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ లో 13 ఏళ్ల చిన్నారులతో లైంగిక చర్యల కోసం 50 సెంట్లు (సుమారు రూ. 34) చెల్లిస్తున్నారని, ఇది అత్యంత సిగ్గు చేటని అన్నారు. గడచిన 14 నెలల్లో ఈ తరహా కేసులు 22 వరకూ వెలుగులోకి వచ్చాయని, ఈ తరహా నేరాలపై ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఐరాస తరఫున ప్రస్తుతం ఆఫ్రికాలో 9 శాంతి రక్షక దళాలు పనిచేస్తున్నాయని, మాలి, సౌత్ సూడాన్, లైబీరియా, కాంగో దేశాల్లో తమ దళాలపైనే అత్యాచార, సెక్స్ రాకెట్ ఆరోపణలు రావడంతో తన మనసు విచారంతో నిండిపోయిందని బాన్ కీ మూన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై స్వతంత్ర దర్యాఫ్తును జరిపిస్తున్నామని అన్నారు. అక్కడి ప్రజలు తమను రక్షించేందుకు వీరు వచ్చారని ఆదరిస్తుంటే, శాంతి పేరిట కామకలాపాలు సాగిస్తుండటం, చిన్నారులను బలిపశువులను చేస్తుండటం సహించరాని దుర్మార్గమని అన్నారు. అయితే, వీరి పేర్లను, జాతీయతను మాత్రం ఐరాస అధికారులు విడుదల చేయకపోవడం గమనార్హం.