: ఆప్ ‘ధర్నా’ పార్టీనే కాదు... పాలనా సామర్థ్యం ఉన్న పార్టీ కూడా!...అందుకు ‘సరి-బేసి’ నిదర్శనమంటున్న కేజ్రీ
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ‘సరి-బేసి’ విధానం విజయవంతమవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లో సరికొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. సివిల్ సర్వెంట్ పదవికి ఉన్నపళంగా రాజీనామా చేసేసి రాజకీయ తెరంగేట్రం చేసిన కేజ్రీ... తొలి యత్నంలోనే చుక్కలు చూపించారు. తొలి ఎన్నికల్లోనే విజయఢంకా మోగించిన కేజ్రీ... ఢిల్లీలో 15 ఏళ్లుగా సాగుతూ వస్తున్న షీలా దీక్షిత్ పాలనకు చరమగీతం పాడి పాలనా బాధ్యతలు చేపట్టారు. అయితే కేంద్రంతో ఏర్పడ్డ అభిప్రాయ భేదాల కారణంగా అనతి కాలంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు కొత్తగా కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ బీజేపీకి కూడా ఆయన షాకిచ్చి ఏడాది వ్యవధిలో రెండు పర్యాయాలు సీఎం పీఠాన్ని దక్కించుకోగలిగారు. రెండోసారి కూడా ఆయన కేంద్రంతో పోట్లాటకే సిద్ధపడ్డారు. ఈ క్రమంలో ఆయన పార్టీ... ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ధర్నా పార్టీగా పేరు పడిపోయింది. చీపురు పార్టీగానూ పిలుస్తున్న ఆ పార్టీ ప్రభుత్వం సరికొత్తగా ఢిల్లీలో ప్రవేశపెట్టిన ‘సరి-బేసి’ విజయవంతమైంది. ఈ సంతోష సమయంలో కేజ్రీవాల్ నిన్న ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆప్... కేవలం ధర్నా పార్టీనే కాదు, పాలనా సామర్ధ్యం ఉన్న పార్టీగా కూడా నిరూపితమైందని ఆయన ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇందుకు ‘సరి-బేసి’ విధానమే నిదర్శనమైందని ఆయన చెప్పుకొచ్చారు.