: మరో రహస్య భేటీ?... భారత్, పాక్ జాతీయ భద్రతా సలహాదారుల సమాలోచనలు
భారత్, పాకిస్థాన్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ లు వాతావరణ సదస్సులో భాగంగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఆత్మీయంగా పలకరించుకున్న ఫలితంగా ఇరు దేశాల మధ్య చర్చలకు దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. ఇద్దరు ప్రధానులు తమ దేశాలకు చేరుకున్న మరుక్షణమే ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, నాసర్ ఖాన్ జంజువాలు బ్యాంకాక్ లో రహస్యంగా భేటీ అయ్యారు. సదరు భేటీ ముగిసి, వారిద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేసేదాకా అసలు అక్కడ వారిద్దరు కలిసిన విషయమే బయటి ప్రపంచానికి తెలియదు. తాజాగా మరోమారు దోవల్, జంజువాలు రహస్యంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల మధ్య ఈ నెల 15న భేటీ జరగాల్సి ఉంది. అయితే ఈ నెల 2న ఉగ్రవాదులు పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై మెరుపు దాడి చేయడంతో ఆ చర్చలు కాస్తా విఫలమయ్యే ప్రమాదం పొంచి ఉంది. దాడికి సంబంధించిన సూత్రధారులు పాక్ భూభాగంలోనే ఉన్నారని చెబుతున్న భారత్, వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఆ దేశంతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ముందు నిందితులపై చర్యలు, ఆ తర్వాతే చర్చలంటూ భారత్ తన స్వరం పెంచింది. ఈ నేపథ్యంలో పాక్ కూడా దర్యాప్తును ముమ్మరం చేయక తప్పలేదు. ఇప్పటికే పాక్ లోని మూడు జిల్లాల్లో షరీఫ్ ఏర్పాటు చేసిన సంయుక్త దర్యాప్తు బృందం పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. ఇక విదేశాంగ శాఖ కార్యదర్శుల మధ్య భేటీకి మరో 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో దోవల్ తో రహస్య భేటీకి జంజువా పావులు కదుపుతున్నారు. పఠాన్ కోట్ దాడికి సంబంధించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని చెప్పడమే కాక ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తును దోవల్ ముందు పెట్టేందుకు జంజువా సిద్ధపడ్డారట. ఈ క్రమంలో రహస్య భేటీకి జంజువా చేసిన ప్రతిపాదనకు దోవల్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. ఈ భేటీ కూడా తటస్థ వేదికపైనే (భారత్, పాక్ నగరాల్లో కాకుండా వేరే దేశానికి చెందిన నగరం) జరగనున్నట్లు పాక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ జరిగితే, ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల మధ్య చర్చలు కూడా తప్పనిసరిగా జరిగే అవకాశాలున్నట్లు కూడా ఆ వర్గాలు భావిస్తున్నాయి.