: రూ.40 కోసం... రూ.33 వేలు తగలేసిన గ్రీన్ ట్రైబ్యునల్!


చిన్న పత్రం లేకున్నా కేసు విచారణను వాయిదా వేస్తున్న నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్... దేశంలోని అన్ని రాష్ట్రాలకు పర్యావరణ సంబంధిత అంశాల్లో షాకిస్తోంది. మొన్నటికి మొన్న నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి గ్రీన్ బెల్ట్ లేదని చెప్పిన ట్రైబ్యునల్... అనుమతి ఇచ్చేదాకా భూమి చదును పనులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయినా, ఏపీ సర్కారు చేసిన తప్పేమిటో తెలుసా? రాజధాని నిర్మాణంలో ఎక్కడ ఏ భవనం కడుతున్నామన్న విషయాన్ని చెప్పకపోవడమే. ఈ చిన్న విషయాన్ని సాకుగా చూపిన ట్రైబ్యునల్... మొత్తం పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసి కలకలం రేపింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన కార్యకలాపాలు సాగించే ఈ ట్రైబ్యునల్ తాజాగా ఓ ఘన కార్యం చేసింది. రూ.40 కోసం ఏకంగా రూ.33 వేలు ఖర్చు పెట్టేసింది. అది కూడా రెండు దఫాలుగా సమాచార కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేందుకేనట. ఆశ్చర్యకరంగా ఉన్న ఈ విషయంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటిదాకా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటి తాజా పరిస్థితి ఏమిటన్న విషయంపై సమాచారం కావాలని సమాచార హక్కు చట్టం కింద ఆర్కే జైన్ అనే వ్యక్తి సమాచారాన్ని కోరారు. సదరు సమాచారాన్ని అందించేందుకు ట్రైబ్యునల్ వద్ద సమాచారం కూడా ఉంది. అయితే... కావాలనో, లేక మరిచిపోయిన కారణంగానో తెలియదు కాని.. సమాచారానికి సంబంధించిన 20 పేజీల కోసం చెల్లించాల్సిన రూ.40ల చెక్కును జైన్ దరఖాస్తుకు జత చేయలేదు. ఈ కారణంగా జైన్ కు సమాచారం ఇచ్చేందుకు ట్రైబ్యునల్ ససేమిరా అంది. జైన్ సమాచార కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో ఈ వివాదం కేంద్ర సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు వద్దకు చేరింది. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన శ్రీధర్ ఆచార్యులు... రూ.40ల కోసం ట్రైబ్యునల్ ఏకంగా రూ.33 వేలను తగలేసిన వైనాన్ని వెలికితీశారు. రూ.40 చెల్లించని కారణంగానే సమాచారాన్ని ఇవ్వలేకపోయామన్న సింగిల్ మాట చెప్పేందుకు ట్రైబ్యునల్... తాను నియమించుకున్న న్యాయవాదికి తొలి వాయిదాకు రూ.11 వేలు సమర్పించుకుంది. ఇక రెండో దఫా అదే సింగల్ లైన్ మాటను చెప్పేందుకు లాయర్ల ఫీజు కింద మరో రూ.22 వేలను చెల్లించేసింది. వెరసి రూ.40 ఇవ్వలేదని చెప్పేందుకు ట్రైబ్యునల్ ఏకంగా రూ.33 వేలను తగలేసింది. ఇందుకు బాధ్యులైన అధికారిని గుర్తించి, సదరు అధికారి వేతనం నుంచి రూ.33 వేలను రికవరీ చేయాలని శ్రీధర్ ఆచార్యులు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News